Saturday 30 November 2013

జీవితమనే ఫేస్ బుక్ !

నచ్చగానే క్లిక్ కొట్టడానికి అది ఫేస్ బుక్ లో లైక్ కాదు
ఎన్నో నిర్జీవాల మధ్య దేవుడిచ్చిన లైఫ్
నీకు నచ్చినట్టుగా, నలుగురూ మెచ్చేట్టుగా నువ్వే లైన్ చేసుకోవాలి.
షేవింగ్ క్రీమ్ కొనుక్కునే వయసొచ్చినపుడు
షేర్ చేసుకోలేని ఆలోచనలెన్నో వస్తుంటాయి
సేవింగ్స్ లో వేటిని ఉంచాలో, వేటిని తొలగించాలో నువ్వే నిర్ణయించుకోవాలి.
మనం చూసేవన్నీ మన పోస్ట్ లు కాదు
మనం కోరుకునేవన్నీ మన టేస్ట్ లూ కాదు
పరిసరాలు, పరిస్థితులు మనకు తెలియకుండానే వాటిని కోట్ చేసేస్తాయి.
టైమ్ వేస్ట్ చేసుకుంటూపోయి కొన్నాళ్ళకు వెనుతిరిగి చూస్కుంటే
జీవితపు టైమ్ లైన్ పై మన సత్తా ఏమిటో కనిపిస్తుంది
లైఫ్ టైమ్ అఛీవ్మెంటైనా.. లైఫ్ లెస్ ఫనిష్మెంటైనా మనకు మనం ఇచ్చుకునేదే.
విజయ శిఖరంపై నిలబడితే నువ్వు  ప్రెండ్ రిక్వెష్ట్ లు పంపించక్కర్లేదు
జయజయద్వానాలతో నీకు తెలియకుండానే ఫాలోవర్స్ పెరుగుతారు
నీ ముఖపుస్తకం ఖాతా మొత్తం నోటిఫికేషన్స్ తో నిండిపోతుంది.
కామెంట్స్ అనేవి ఎప్పుడూ వుంటూనే ఉంటాయి
పొగడ్తలను తాత్కాలికంగా మార్క్ చేసుకుని
విమర్శలను తర్కంతో కన్ఫర్మ్ చేసుకుని
ఎదిగే కొద్దీ ఒదగడాన్ని ఫేవరెట్ గా మార్చుకుని
సక్సస్ మంత్రాన్ని ప్రొఫైల్ గా రాసుకుని ముందుకు సాగిపో...
జీవితమనే ఫేస్ బుక్! లో సాఫీగా లాగిన్ అవ్వాలంటే...
లక్ష్యం అనే  పాస్ వర్డ్ స్ట్రాంగ్ గా వుండాలని గుర్తుపెట్టుకుంటూ..!

Friday 22 November 2013

వీడింత మంచోడేంట్రా!

వీడింత మంచోడేంట్రా!
అప్పులోడు కనిపించినట్టుగా అప్పుడప్పుడు కనిపిస్తాం,
నరం లేని నాలుకతో సిగ్గు లేకుండా వాగ్దానాలిచ్చిపోతాం,
ఎన్నికల జాతరలో వాడి నెత్తిన కాలుపెట్టి అందలాలెక్కేస్తాం,
మాటలు తప్పిన కోటల్లో వాడికి సమాధి కడతాం,
కుర్చీలు కదులుతున్నపుడు మాత్రం ఆ సమాధిని తవ్వి...
కుమిలిపోతూ, కుళ్ళిపోతున్న వాడి అస్థిపంజరంతో
మళ్ళీ మన రాజకీయ రంగుల గుడి కట్టుకుంటాం,
ప్రజాసేవ ముసుగులో పంచెకట్టిన జలగలై, నిశీధి గబ్బిలాలై,
పథకాల పేరుతో పొట్టలు పగిలేలా వాడి చెమట చుక్కలు తాగేస్తాం,
ప్రపంచబ్యాంకు కు వీడి తలరాతను తాకట్టు పెట్టి..
స్విస్ బ్యాంకుల్లో పెరుగుతున్న మన కట్టల పాముల్ని లెక్కలు చూసుకుంటాం,
ఎవరెస్టంత ఎదగడంకోసం వీడిని పాతాళానికి తొక్కేస్తున్నా..
కన్నీటికి కరువొచ్చినట్టు ఏడుపుకూడా ఏడవడు...
కోసిన కోతలను, వేసిన మోతలను మోసుకుంటూ వెళ్ళిపోతాడు.
మన బిడ్డల బిర్యానీ కోసం వీడికి ఎంగిలి ఆకులు విదిల్చినా,
అవే ఆకలి తీర్చే అక్షయపాత్రలనుకుంటాడు,
ప్రజాస్వామ్యంలో వున్నానంటూనే వారసత్వ రాచరికానికి పల్లకీ మోస్తాడు,
కూనీలు చేసినా, మోసాలు చేసినా...
బంగాళాఖాతమంత కుంభకోణాలలో అడ్డంగా దొరికిపోయినా...
నా కులపోడనో, మతమోడనో, ప్రాంతమోడనో మన తప్పుల్ని వెనకేసుకొస్తాడు.
మన అక్రమాల పుట్టలు పగిలి మనకే కుళ్ళు కంపు కొడుతున్నా,
ఐదేళ్ల తర్వాత వెళితే అన్నీ మర్చిపోతాడు.
చిల్లర నాణేలు విసిరితే శమంతకమణులనుకుంటాడు,
బిర్యానీ ప్యాకెట్లకు, బీరు సీసాలకు భవిష్యత్తును బలిపీఠం పై పెడతాడు,
గంగిరెద్దులా తలూపుతూ వెళ్ళి అనకొండలకు ఓటేస్తాడు.
వాటి వికృత పడగ నీడలో వాడి తలరాతను వాడే రాసేసుకుంటాడు...మరో ఐదేళ్ళ వరకు.
వీడింత మంచోడెంట్రా?