Saturday 17 November 2012

అమావాస్య ముందురోజు



     అమావాస్య ముందురోజు...అర్ధరాత్రి...11 గంటల సమయం...దెయ్యాలు తిరుగుతాయని అందరూ చెప్పుకునే ‘నక్కలకాలవ’ వంతెనపై...ఒంటరిగా సైకిల్ పై వెళ్తుంటే ఎలా ఉంటుంది...ఒక్కసారి ఊహించుకోండి..ఆ ఊహ నిజమై నాకు ఎదురైన అనుభవాన్ని బ్లాగు మిత్రులందరితో పంచుకుంటానని ఎప్పుడో మాటిచ్చాను. ఇప్పటికి ఆ మాటను నెరవేర్చుకుంటున్నాను. ఇక చదవండి..!
          ఆచంట నుంచి పెనాదం (పెనుమదం) రావాలంటే  యేమారం (వేమవరం) చెరువు మలుపు దాటి కిలోమీటరు దూరం ఎల్లాక ఇంకో చిన్న మలుపు తిరగ్గానే సిమ్మెంట్ సైడ్ లతో మనకి కనిపిస్తుంది ‘నక్కలకాల్వ వంతెన’. అక్కడ దట్టమైన పొదలు తప్ప ఇళ్ళుగానీ, మనుషులుగానీ ఉండరు. కానీ ఆ చుట్టుపక్కల ఎవరు చనిపోయినా అక్కడికే తీసుకొస్తారు.
           అమాస చీకట్లో ఆచంట నుంచి పెనాదం ఒక్కడినే సైకిల్ మీద వస్తున్నాను. యేమారం దాటేసరికే టైమ్ రాత్రి పదకొండు దాటింది. కటిక చీకటి. ఆరోడ్డులో లైట్లు లేవు. రోడ్డుకూడా బాగా పాడైపోయింది. లూజైపోయిన నా సైకిల్ కేరేజ్ సౌండ్ తప్ప ఆ నిశ్శబ్దంలో మరేమీ వినిపించడంలేదు. ఇంకో రెండు నిమిషాల్లో నక్కలకాల్వ చేరుకుంటాననగా ఎవరో జనం వస్తున్న అలికిడి వినిపించింది. నేను సైకిల్ ని కొంచెం స్లో చేసి చీకట్లో ఆ వచ్చేవారిని గుద్దకుండా జాగర్తగా పక్కనుండి వచ్చే ప్రయత్నం చేస్తుంటే... తడిబట్టలతో, అప్పుడే స్నానాలుచేసి వస్తున్నట్టుగా ఇరవైమంది వరకు నాకు ఎదురొచ్చి నన్ను దాటుకుంటూ వెళ్ళారు. ‘హమ్మయ్య ఈ టైంలో ఏదో కొంత మనిషి అలికిడిలే’ అనుకుంటుండగా...
“ఇంటి సూర్లో దాచిన ఎండ్రిన్ బాటిల్ తీసుకుని మొత్తం తాగేసి చచ్చిపోయేదాకా ఎవ్వరూ చూడ్లేదురా..గాచ్చారం కాకపోతేనూ..” ఆ జనంలోంచి ఎవరో పెద్దాయన అంటున్న మాట నాకు వినిపించింది. అప్పుడుగాని నాకు అసలు విషయం అర్ధంకాలేదు. వెంటనే నక్కలకాల్వ దగ్గర అంతకు ముందు వరకు ఏం జరిగి ఉంటుందో నేను ఊహించాను.
          ఎవరో ఒకతను ఎండ్రిన్ తాగి చనిపోయాడు. అతనికి కాల్వ పక్కన ఉండే చిన్నపాటి స్మశానంలో అంత్యక్రియలు చేసి వీళ్ళందరూ అక్కడ్నించి వస్తున్నారు. చీకట్లో తిరగడాలు, స్మశానం పక్కనుంచి అంత రాత్రి వేళల్లో ప్రయాణం చేయడాలు నాకు కొత్తకాదు కాబట్టి భయం కలగకపోయినా సహజంగానే మనసులో ఏదో చిన్న అలజడి. పైగా అది అందరూ దయ్యాలుంటాయని చెప్పుకునే ‘నక్కలకాల్వ’.

          “ముందు చెప్పిన మలుపు దాటి నేను ప్రస్తుతం నక్కలకాల్వ వంతెన పై ఉన్నాను. సిమెంటు వంతెన ఎక్కగానే ఒక్కసారిగా నా ముఖం పై ఏదో మంటలతాలూకు వెలుగు పడింది. ఇంతక్రితం వెళ్ళిన జనం డొంకల చాటున చితిని అంటించి అది పూర్తిగా ఆరకుండానే వదిలేసి వెళ్ళిపోయారు. దాని తాలూకా ఆనవాళ్ళు ఆ మంటలు. ఆ విషయం తెలిసాక నాకు భయం తీవ్రత పెరగలేదు కానీ పెరిగే ప్రయత్నం లోపల జరుగుతుంది. ఎంత కాదనుకున్నా ఆ వాతావరణం లక్షణం అదేకదా! వంతెన దాటేస్తే సగం గుబులు పోతుంది. ఎందుకంటే ఏం జరిగినా వంతెనపైనే జరుగుతుందని గతంలో అందరూ చెప్పుకునే అనుభవాలు.  ధైర్యం తెచ్చుకుని సైకిల్ కొంచెం స్పీడ్ గా తొక్కాను. అదే చిమ్మచీకటి..అదే నిశ్శబ్దం..అదే ఒంటరి ప్రయాణం... వంతెన దాటేసాను....మనసులో ‘హమ్మయ్య’ అనుకుంటుంటే భయం కిందికి జారిపోయినట్టుగా అనిపిస్తుండగా ఒక్కసారిగా “కిర్ర్..ర్ర్..ర్ర్..ర్ర్..కుర్..కిర్..కిర్...” అని విక్రుతమైన, అర్ధంకాని అరుపు..ఒక్కసారిగా ఆ అరుపుకి నిశ్శబ్ధంగా ఉన్న పరిసరాలన్నీ దద్దరిల్లిపోయాయి. ఆ అరుపు కి ఒంట్లో రక్తం ఒక్కసారిగా ‘ఝమ్మని’ మెదడుకి పోటెత్తిన ఫీలింగ్. అప్పుడు కలిగింది అసలైన భయం. క్షణకాలంలో ఆ అరుపు ‘గుడ్లగూబ’ అరుపు అని గుర్తించి కాసేపటికి భయం నుండి తేరుకున్నాను. సైకిల్ తొక్కడం ఆపలేదు. ఆటైం లో నన్ను అంతగా భయపెట్టిన గుడ్లగూబను ‘బండబూతులు’ తిట్టుకుంటూ చీకట్లో ప్రయాణం కొనసాగించాను.
     ఆ తర్వాత ఆ రూట్లో చాలాసార్లు రాత్రిపూట ప్రయాణం చేసాను..కానీ ప్రతిసారీ ‘గుడ్లగూబ అరవొచ్చు’ అని మనసులో ముందే ఫిక్సయ్యేవాడిని.

గతంలో నేను రాసిన ‘నక్కలకాల్వ మొదటి టపా’ కోసం ఇక్కడ ఇచ్చిన ముడిని నొక్కండి..

Friday 9 November 2012

జెఠ్మలాని చెత్తవాగుడు


“అకారణంగా సీతను అడవికి పంపిన రాముడిని నేను ఆరాధించను..” – జెఠ్మలాని! 
"నీలాంటి వాళ్ళు ఆరాధింకపోతే  ఏంటట నష్టం?"

       జెఠ్మలానిలాంటి వాళ్ళు తమ స్వార్ధంకోసం చేసే రాద్ధాంతాల వలన  ధర్మానికి  అధర్మం అనే ఎంగిలి అంటుకోదు. ధర్మదేవత కోటు వేసుకుని నోట్లకోసం అవినీతి అధినేతల తరపున వకాల్తా పుచ్చుకుని వాదించే ఇలాంటి వారికి నిజమైన ‘ధర్మకోణం’ ఎప్పటికీ రుచించదు, అసలు కనిపించదు కూడా.

     అసలు ఈయన్ని రాముని గురించి నమ్మమని, ఆరాధించమని ఇప్పుడు ఎవరు బలవంతం చేసారు. ఈయనకి ప్రపంచంలో ఉన్న అధ్యాత్మిక పురుషులందరు పైన నమ్మకం ఉండి ఒక్క రాముని పైనే నమ్మకంలేదా?  అలా అయితే ఆయన అభిప్రాయాన్ని ఆయన వద్దే ఉంచుకోవాలి.ఇలా మరొకరి మనోభావాలపై బురదచల్లి తన దురద తీర్చుకోవడం ఎందుకు. ఈ విశాల భారతావనిలో  ఎవరికివారు తమకు నచ్చిన ధర్మాన్ని ఆరాధిస్తూ సామాజిక జీవనం సాగిస్తున్నారు. అంతమాత్రాన ఎవరికి వారు ఇలా నోరుపారేసుకుంటే ఎలా ఉంటుందో ఈ మేధావికి తెలియని విషయం అనుకోవాల? ఇలాంటి వ్యాఖ్యలే మరెవరిమీదైనా  చేసుంటే ఈపాటికి ఈయన  పరిస్తితి ఎలా ఉండేదో జెఠ్మలానికి బాగా తెలుసు. అందుకే అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇలాంటి వాళ్ళు భయపడతారు. 

      పురవీధిలో దేవుని పల్లకి బయల్దేరుతుంటే మంగళవాయిద్యాలు ఒక్కసారిగా మోగుతాయి. అదివిన్న జనానికి భక్తిభావం ఉప్పొంగుతుంది. అదే సమయంలో ఆ వీధిలో ఉండే కుక్కలు ఉలిక్కిపడి మొరగడం ప్రారంభిస్తాయి. అంతమాత్రాన వాటి పరపతి పెరగదు, స్వామివారి పరపతి తగ్గదు.