Friday 30 December 2011

నక్కబావకు కొత్త సంవత్సరం కిక్

అనగనగనగా ఒక నక్క, ఒక కొంగ. ఆ రెండిటి మధ్య చిన్నపాటి స్నేహం వుంది. కొంగ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకపోయినా నక్క మనసులో మాత్రం అప్పుడప్పుడు దాని జిత్తులమారి లక్షణాలు బయటపడేవి. 

ఒక రోజు కొంగ, నక్క బార్ లో కూర్చుని మందు కొడుతున్నాయి. వాళ్ళ ఒప్పందం ప్రకారం ఆరోజు బార్ లో బిల్లు నక్క కట్టాలి.కాని మధ్యలో దానికో దురాలోచన పుట్టింది. కొంగ చేత కొంచెం ఎక్కువ మందు కొట్టించి, మత్తు తలకెక్కాక సెంటిమెంట్ టచ్ ఇచ్చి ఆరోజు బిల్లు కూడా కొంగ చేతే కట్టించాలని అనుకుంది.ఈ విషయాన్ని గమనించిన కొంగ అతిగా తాగకుండా జాగ్రత్త పడుతూ, ఆవిషయం నక్కకు తెలియకుండా నక్క చేతే ఎక్కువగా తాగించింది. 

దానికి మత్తు తలకెక్కాక " నక్కబావా! నక్కబావా! మనిద్దరి స్నేహం చిరకాలం ఇలాగే వుండాలంటే నాదో చిన్న కోరిక. నువ్వు కాదనకూడదు" అంది.
"హె! నీమాట కాదనడమా. నెవర్. ఆ కోరికేంటో చెప్పు కొంగబావా!" అంది మాటలు తడబడుతూ.
"మనం ప్రతిరోజు ఇలాగే, ఈ బార్ లోనే ఫుల్లుగా మందు కొట్టాలి. ఈ సంవత్సరమంతా ఆ బిల్లు నేనే కట్టాలి"
నక్క ఒక్కసారిగా టేబుల పై నుండి కింద పడిపోయింది. 'ఇదేంటిది ఇవాలొక్కరోజు దాని చేత  బిల్లు కట్టించాలని నేను ప్లాన్ వేస్తే మొత్తం సంవత్సరమంతా కట్టేత్తానంటాదేంటి..ఇంతకన్నా ఏం కావాలి. సంవత్సరం పాటు మనకి మందు ఫ్రీ!' అని సంతోషపడి.
"కొంగ బావా! మన స్నేహానికి ఇంత పెద్ద గిప్ట్ ఇస్తావని మత్తులో కూడా ఊహించలేదు. అయితే నాది కూడా ఒక చిన్న కోరిక"
"ఏంటది నక్కబావా?"
"ఈ సంవత్సరం బిల్లంతా నువ్వు కట్టి నీ స్నేహాన్ని నిరూపించుకున్నావ్. వచ్చే సంవత్సరం బిల్లు మొత్తం  నన్ను కట్టనిచ్చి నాస్నేహాన్ని నిరూపించుకోనియ్" అని అంది.
"అలాగే అంతకన్నానా. పద"

రెండూ కలసి క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాయి.

"ఇదిగో బాబు! ఈ క్రెడిట్ కార్డ్ నుంచి వచ్చే సంవత్సరానికి మా ఇద్దరికి మందు ఖర్చు ఎంతవుతుందో అంత ఇప్పుడే గీకేసుకో..టిప్పుతో సహా" అని క్రెడిట్ కార్డ్ ఇచ్చింది నక్క.
"అన్-లిమిటెడ్ ప్యాక్ తీస్కోండి సార్. టిప్పుతో కలిసి రెండు లక్షలు అవుతుంది. మీకు మందు ఎక్కువై పడిపోయినా మేమే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం" అన్నాడు కౌంటర్ అబ్బాయి.
"అలాగే కానియ్" అంది నక్క. 
ఇప్పుడు కొంగ "ఇదిగో బాబు రెండు వేలు. ఈ సంవత్సరం మొత్తానికి నేను కడుతున్న బిల్లు" అంటు క్యాష్ తీసిచ్చింది.
నక్క షాక్ తిని..
"అదేంటి బావా! నాకు సంవత్సరం బిల్లు రెండు లక్షలేంటి. నీకు రెండువేలేంటి?" అంది ఆశ్చర్యంగా.
"ఈరోజు డిసెంబర్ 31 బావా. నేను కట్టాల్సిన సంవత్సరం ఈ రోజుతో ఐపోయింది" అని కళ్ళు చిట్లించింది.
నక్కబావ కొత్త సంవత్సరం కిక్  కి తట్టుకోలేక కిందపడిపోయింది. కొంగ నెక్స్ట్ ఇయర్ అకౌంట్ లో ఒక ఫుల్ బాటిల్ తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది.

....బ్లాగరులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు....

Thursday 15 December 2011

జామకాయ తినాలంటే!

ముందుగా నాణ్యమైన జామ మొక్కను ఎంచుకోవాలి!

మొక్కకు ఎలాంటి లోటు రాకుండా పోషణ చేయాలి!

మొక్కకాస్తా బలంగా పెరిగి చెట్టులా మారుతుంది!

ఇలా పూతపూసి కాయలు కాయడానికి సిధ్దమౌతుంది!

ఒళ్ళంతా కాయలు చేసుకుని విరగకాస్తుంది!

కాయలు పక్వానికి వచ్చాయని చిలకమ్మ ఇలా కొరికి చెబుతుంది!

మనం ఆమ్..ఆమ్మని తినెయ్యాలీ...!

Wednesday 14 December 2011

నక్కల కాలవ - దెయ్యాలగొడవ

చింతామణి - మా గోపీ మాస్టార్ టపాలో 'నక్కల కాలవ - దెయ్యాలగొడవ' అనే టాపిక్ వచ్చింది. ఈ విషయం గురించి మరో టపాలో వివరిస్తానని చెప్పాను. ఈ నక్కల కాలవ కు సంబందించిన, నేను విన్న దెయ్యం కథ ఒకటి చెప్తాను..!

ఆచంటలో రెండెడ్ల బండి తోలే సానబోయిన కొండయ్య ప్రతి శనివారం పాలకొల్లు నుంచి ఆచంట కిరాణా సరుకులు వేసుకెళ్ళేవాడు.పాలకొల్లు శనివారం సంతంటే చాలా పెద్ద పేరు. అటు దొడ్డిపట్ల నుంచి ఇటు వీరాసరం వరకు, ఇటు కరుగోరుమిల్లి, కందరవల్లి, ఆచంట నుంచి అటు చించినాడ వరకు షావుకారులందరు వారానికి సరిపడా కిరాణా సరుకులన్నీ టోకున కొని ఎడ్ల బళ్ళ  పై వేసుకుని వెళ్ళేవారు. ఆ రకంగా కొండయ్య ప్రతి శనివారం పెద్ద లోడుతో రాత్రిపూట నక్కల కాలవ మీదుగా ఆచంట వెళ్ళడం పరిపాటి.

ఒక శనివారం ఎడ్లకు నాడాలు వేయించే పని పెట్టుకుని రాత్రి బాగా పొద్దుపోయాక కిరాణా లోడుతో బయల్దేరాడు. గుమ్ములూరు మైలు రాయి దాటాక చుట్టూ చిమ్మ చీకటి. అలవాటైన దారి కావడంతో తోలేవారి ప్రమేయం లేకుండానే ఎడ్లు బండిని లాక్కెళ్ళిపోతున్నాయి.కొంచెం సేపట్లో నక్కల కాలవ చేరుకుంటామనగా రోడ్డు పక్కన ఒకతను చెయ్యేత్తి బండి ఆపాడు. అతను కొడమంచిలి పెదబాబుగారి పాలేరు వీరయ్య.
"ఎవరది?" అన్నాడు కొండయ్య
"ఏండి... కొడమంచిలి వరకు ఎల్లాలి. బండి ఎక్కించుకోండే' అన్నాడు.
కొండయ్య సరే అనడంతో టేకు ఆకు చక్రం పై బలంగా కాలెట్టి గెంతి వెళ్ళి బండిలో కూర్చున్నాడు. బండి కదిలింది.

'పెదమల్లం లాస్ట్ బస్సు దాటిపోయిందండే. నడిచెల్లి పోదామని వచ్చేసానుకాని ఇక్కడ కొచ్చాక దైర్యం సరిపోలేదండే కొండయ్యగారా' అని అసలు విషయం చెప్పాడు వీరయ్య. కొండయ్య చిన్నగా నవ్వి ఊరుకుని చుట్ట వెలిగించాడు. చిమ్మచీకట్లో ఎడ్ల గంటల మోత తప్పితే ఏమీ కనిపించట్లేదు, వినిపించట్లేదు. నక్కల కాలవ వచ్చేసింది.

కొండయ్య, వీరయ్య యేవో కబుర్లో పడ్డారు. బండి నక్కలకాల్వ వంతెన ఎక్కింది. వీరిద్దరిలో ఎవరికీ దాని ద్యాస లేదు. వంతెన మధ్యలోకి రాగానే ఎడ్లు కదలడం మానేసి నిలబడిపోయాయి. ఇద్దరు కబుర్లాపి వున్న కూసింత వెలుగులో ఏమయ్యిందా అని చూడసాగారు. ఇద్దరికీ ఏమీ కనిపించలేదుగాని దాపటి ఎద్దు బెరుకుగా వెనక్కి లాగుతుంటే ఎలపటి ఎద్దు మాత్రం కోపంతో బుసలు కొడుతూ కాలు దువ్వుతుంది. తోలుగర్ర పక్కన పడేసి ఏమయ్యిందా అని బండి దిగబోతున్న కొండయ్యని 'కొండయ్యగారా బండి దిగొద్దండి' అని గట్టిగా అరిచాడు వీరయ్య . ఆ అరుపుకు ఉలిక్కిపడిన కొండయ్య వీరయ్య వైపు చూసాడు.

'ఇక్కడ ఇలాంటివన్నీ మామూలే కదండే..తొందరపడితే ఎలాగ' కొండయ్యను వెనక్కి వెళ్లమని వీరయ్య వెళ్ళి బండి తొట్టులో వున్న వట్టి గడ్డిని (ఎండు గడ్డి) చిన్న సైజు కట్టలాగ కట్టి అగ్గిపుల్లతో ఎలిగించి బండి కి ఎదురుగా పడేసి ఎడ్లను అదిలించాడు.ఎడ్లకు దారి కనపడింది కాని వాటి ప్రవర్తనలో మార్పు రాలేదు. అలా నాలుగైదు కట్టలు అంటించి బండి ముందరకు విసిరేస్తూ 'త.... నా సంగతి తేలీదు నీకు.  పాతచెప్పుదెబ్బలు, ఎండు మిరపకాయ్ దూపమేసాననుకో మళ్ళీకోలుకోలేవు.. అడ్డు లెగెహే' అని గాలిలోకి చూస్తూ తిట్టడం మొదలెట్టాడు. ఇప్పటికి ఎడ్లు కొంచెం బెరుకు వదిలి స్థిమితపడ్డాయి. వెనకాల కూర్చున్న కొండయ్య గడ్డి కట్టలు కట్టి ఇస్తుంటే వీరయ్య వాటిని అంటించి బండి ముందరకు విసురుతూ,నోటికొచ్చిన తిట్లు తిడుతూ, ఎడ్లను అదిలిస్తూ మెల్లగా వంతెన దాటించాడు. ఆ నక్కల కాలవ వంతెన దిగగానే అవి ఎలాంటి తత్తరపాటు లేకుండా బండిని లాక్కెళ్ళిపోతున్నాయి. కొండయ్య కి చెమటలు పట్టేసాయి.
కాసేపటికి తేరుకుని 'ఏమయ్యుంటుంది?' అని అడిగాడు కొండయ్య.
'నిన్న పేటలో ఓ కుర్రాడు ఎండ్రిన్ తాగి చచ్చిపోయాడంటండి. ఆడే అయ్యుంటాడు. ఈ రూట్లో వచ్చేటప్పుడు మీరు జాగర్తగా ఉండండి. ఇంటికెళ్ళగానే నాలుగు ఉప్పు కళ్ళు ఎడ్లకు దిష్టి తీసి పొయ్యలో పడెయ్యండి ' అని 'దాపటి దానికింకా దడ తగ్గలేదండే'  అని  నడుం మీద చెయ్యేసి నిమిరాడు. అది తోకతో విదిలించుకుంది.

ఇది కొండయ్యగారు ఆయన స్వీయ అనుభవాన్ని యార్లగడ్డ సుబ్బారాయుడికి  చెప్తుండగా నేను విన్నది.

ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసిన దారిలో, అమావాస్య ముందురోజు రాత్రి 11 గంటలకు ఒంటరిగా సైకిల్ మీద వెళ్ళ్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. నావరకు అది ఊహకాదు..నిజం.. అలాంటి సమయంలో వున్న నాకు 'నక్కల కాలవ' వంతెన పై ఎదురైన అనుభవం ఏమిటో తదుపరి టపాలో చెప్తాను.

Sunday 11 December 2011

చింతామణి-మా గోపి మాస్టారు

'చిక్కుల్లో చింతామణి' అని టివి9 లో వార్త చూసాను. 'ఈ నాటకం ఒక వర్గం వారిని కించపరిచేలా వుందన్న కారణంగా నాటక  ప్రదర్శనను నిలిపివేయాలని వారు కోరుకుంటున్నారు' అనేది వార్త సారశం. ఇందుకు సంబందించి మిగిలిన విషయాల వైపు వెళ్లకుండా నాకు ఈ వార్త కారణంగా  'చింతామణి' నాటకం గుర్తుచేసిన జ్ఞాపకాల దొంతరలను మాత్రమే ప్రియ బ్లాగరులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను..!

చింతామణి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆచంట శివరాత్రి జాతర. మా చిన్నప్పుడు శివరాత్రి ఉత్సవాలకు 'ఆచంట' పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగేది. మా వరకు ఐతే కాలెండర్ తిరగేస్తు శివరాత్రి ఎప్పుడా అని ఎదురు చూసేవాళ్ళం.

కళ్ళి నాగేశ్వర్రావు కి మహింద్ర ట్రాక్టర్ వుండేది. సాయంత్రం వరకు బంటా పని చేసి (ట్రాక్టర్ తో మట్టి తోలడం లాంటి పనులు) 20 మంది  వరకు కుర్రాళ్ళు  శివరాత్రి రోజు  రాత్రి ఆచంట బయల్దేరేవారు. మేము చిన్నపిల్లలం కాబట్టి ట్రాక్టర్ ట్రక్కులో ఒక మూలన కూర్చునే వాళ్ళం. 

పెనాదం నుండి ఆచంట కు సుమారుగా  పదిహేను కిలోమీటర్ల దూరం వుంటుంది. రాత్రివేళ ప్రయాణం, చుట్టూ దట్టంగా మంచు పట్టేసి ట్రాక్టర్ తోలే డ్రైవర్ కి తప్ప ట్రక్కులో కూర్చున్న వారికి దారి కనిపించేదికాదు. 'గుమ్ములూరు' , 'ఆచంట యేమారం' కి మధ్యలో 'నక్కల కాలవ' అని ఒక పెద్ద కాలవ  వుంది. అది దగ్గరపడుతుందంటే  పిల్లలకే కాదు, పెద్దలకి కూడా భయమే. అక్కడ దెయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని, సరిగ్గా వంతెన దాటే సమయంలో కాలవ మధ్యలో వుండగా అవి ఏదో రకంగా ఆ సిమెంట్ వంతెన పై నుండి వెళ్లేవారిని ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తాయని కథలు కథలుగా చెప్పుకునేవారు. (నక్కల కాలవ దెయ్యాల కథలను మరో టపాలో వివరంగా చెబుతాను).

ఆచంట రామేశ్వరస్వామి గుడి దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ జాతర చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవ్వడానికి ఇంకా టైం పడుతుందంటే వేడివేడి జిలేబి, వేడివేడి చికెన్ పకోడి పొట్లం కట్టించుకుని పక్కనే వున్న 'నటరాజ్ దియేటర్'లోనో, 'కళ్యాణ చక్రవర్తి' దియేటర్లోనో సినిమాకి చెక్కెయ్యడం, సరిగ్గా 'చింతామణి' నాటకం మొదలయ్యే సమయానికి బయటకొచ్చెయ్యడం. డ్రామా చూడటంకోసం తాటాకు పందిరి కింద సెటిలై పోవడం. నాటకం మొదలవ్వగానే చూడండి వుంటుంది... తీర్ధంలో అమ్మకానికి తెచ్చిన బూరలన్నీ ఒకేసారి మోగినట్టుగా కుర్రగాలం 'బుయ్...' మని ఊదేవారు. ఒకటే ఈలలు.ఇందులో శ్రీహరి-సుబ్బిశెట్టి మధ్య వచ్చే సంభాషణలకి జనం ఒకటే ఈలలు, చప్పట్లు. వాటి ముందు నేటి వందరోజుల సినిమాలు ఎందుకు పనికిరావంటే అతిశయోక్తి కాదేమో.నాటకంలోని కళాకారులు సందర్భోచితంగా ఆ ఊరి ప్రెసిడెంట్,కర్ణం ఇలా  ఊళ్ళో కొంచెం పేరున్న వ్యక్తులను కూడా వారి నాటకంలో కలిపేసి డైలాగ్స్ అనర్ఘళంగా చెప్పేవారు.అలాంటి సమయంలో సదరు వ్యక్తులు అక్కడ వుండుంటే వెంటనే ఎంతోకొంత కళాకారులకు చదివింపుగా మైక్ లో ప్రకటించేవారు.

ఇక శ్రీహరి పాత్ర ను (చింతామణి తల్లి) మగవారే వేసేవారనే విషయం మొదట్లో నాకు తెలీదు. ఎందుకంటే ఆ మేకప్ లో అచ్చం ఆడవారికి మల్లే ఉండేవారు ఆ పాత్రను దరించే పురుషులు. కొంచెం ఊహ తెలిసిన తర్వాత తెలిసిన నిజం ఏమిటంటే..చింతామణి నాటకంలో శ్రీహరి వేషం వేస్తున్నది ఎవరో కాదు మా బడిలో ఐదవ తరగతి పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్చిన 'గోపి' మాస్టారేనని. నేను అప్పుడు నాలుగో తరగతిలో వున్నాను.

నేను ఐదవ తరగతిలోకి వచ్చాను. మొదటిసారి 'గోపి' మాస్టారు సోషల్ చెప్పడానికి వచ్చారు. నాకు ఆయన్ని చూస్తుంటే శ్రీహరి, ఆమె కట్టిన గుమ్మడి పూల నీలంరంగు చీర, పొడవాటి జడ, జడ నిండా బుట్టెడు పూలు, ఒంటినిండా నగలు, నడుముకి వడ్డాణం, నాటకంలో వుండే పాత్రధారులతో ఆమె వేసే చతుర్లు..ఇవే గుర్తుకొస్తున్నాయి. క్లాసులో ఏం చెప్తున్నారో తెలీదు. నేనెక్కడో శివరాత్రి జాతరలోకి వెళ్ళిపోయాను. అప్పటికే ఆయన నన్ను గమనిస్తున్నారనే విషయం నాకు తెలియలేదు. నేను ఊహల్లో వుండగానే వాటంగా వున్న పచ్చి 'తూటుకర్ర'తో ఒక్కటిచ్చారు. దెబ్బ తగిలిందని నాకు  తెలియడానికంటే ముందే నాకళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి. "ఏరా..ఏం రోగం? ఇక్కడ పాఠం చెప్తుంటే అక్కడెక్కడో చూత్తున్నావేంటి. నువ్వు రామ్మూర్తిగారి మనవడవు కదూ. రేపొచ్చేటప్పుడు మీ తాతను తీసుకురా మాట్లాడాలి" అని క్లాసులో నుండి బయటకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్తున్నప్పుడు కూడా ఆయన నడకలో నాకు అదే ఆడతనం కనిపించి ఏడుపు పోయి నవ్వొచ్చేసింది.

Friday 9 December 2011

నాటుకోడి స్పెషల్ బిర్యాని


అనగనగా ఒక కోడిపుంజు. దానికి ఎప్పట్నించో 'చికెన్ బిర్యాని' తినాలని బలమైన  కోరిక. కొన్నాళ్ళకి అదుండే ఏరియాకు దగ్గర్లో ఒక బిర్యాని సెంటర్ పుట్టుకొచ్చింది.  ప్రతిరోజు ఆ హొటల్ నుండి బిర్యాని ఘుమఘుమలు ఎక్కువకావడంతో బిర్యాని తినాలనే కోరిక ఇంకా బాగా ఎక్కువైపోయింది.

ఒకరోజు రాత్రి అందరు నిద్రపోగానే  ఎలాగైనా సరే  బిర్యాని రుచి చూడాల్సిందే అని దొంగతనంగా ఆ హొటల్ లో దూరింది కోడిపుంజు. వంటవాళ్ళు, పనివాళ్ళు అందరూ గాఢ నిద్రలో వున్నారు. తన్నితే బిర్యాని బేసిన్ లో పడ్డట్టుగా ఫీలై ఆ ఘుమఘుమలను అస్వాదిస్తూ హొటలంతా కలదిరిగింది. ఒక చోట బిర్యాని పార్సిల్స్ లాటు కనిపించింది. వాటిని పొడుచుకుని తినబోయి బిర్యానీలోకి దమ్స్... వుంటే ఇంకా బాగుంటుందని వెళ్ళి ఒక బాటిల్ తెచ్చుకుంది. సరిగ్గా తినబోయే సమయానికి దాని మెదడులోని సంకేతాలు తొలిఝాము అయ్యిందని హెచ్చరించాయి. అలవాటులో పొరపాటుగా  'పుంజురాజావారు' రెక్కలు టపటపలాడించి, మెడ పైకెత్తి "కొక్కురొక్కో..." అని గట్టిగా కూసింది..అది హొటల్ లో వున్నానన్న సంగతి మర్చిపోయి. దాని కూతకు ఉలిక్కిపడిలేచారు హోటల్ లో పనిచేసే   బిర్యాని బాబులు. డ్యూటీ డిసిప్లిన్ లో పడి తానెంత తప్పు చేసానో తెలుసుకుని నాలుక కరుచుకుంది. కాని అప్పటికే జరగాల్సిన అనర్ధం జరిగిపోయింది.
కట్ చేస్తే..
"ఈరోజు నాటుకోడి స్పెషల్ బిర్యాని" అని బోర్డు మీద రాసిపెట్టారు.
తొలిఝాములో అలారం...తెల్లారేసరికి పలహారం!

Saturday 3 December 2011

'కార్యేషు దాసుడు'

సికింద్రాబాద్ నుండి పాలకొల్లు వరకు  నర్సాపూర్   express  లో ప్రయాణం చేస్తున్నాను. నాకు మొదట్నించి రిజర్వేషన్ బోగీలో ప్రయాణం చేయడంకంటే జనరల్ బోగీలోనే ప్రయాణం చేయడం ఇష్టం. కొన్నికొన్ని అసౌకర్యాల గురించి మర్చిపోతే అక్కడ వుండే ప్రయాణీకుల్లో రకరకాల మనుషులను, మనస్తత్వాలను, అభిప్రాయాలను దగ్గర నుండి పరిశీలించే అవకాశం వుంటుంది.ఐపాడ్స్, headphones  వచ్చిన తర్వాత రిజర్వేషన్ బోగీలలో ప్రయాణించే ప్రయాణీకుల మధ్య దూరాలు బాగా పెరిగిపోయాయి. పక్క పక్క బెర్త్ లోనే వున్నప్పటికి ఎవరి ప్రపంచం వారిది. లగేజ్ సర్దగానే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ట్రైన్ తో పాటుగా పాటలలోకం లో వూగిపోతుంటారు.ఇవన్నీ అదోరకమైన ఒంటరి ప్రయాణాలు...!

జనరల్ బోగీ కావడంతో కొంచెం రద్దీగానే వుంది. కూరగాయల ధరల నుండి కుంభకోణాల వరకు అసలైన ప్రజానీకం సిసలైన కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటినీ సావధానంగా పరికిస్తున్న నా కళ్ళు కిటికీ దగ్గర వున్న సింగిల్ సీటర్ పై  ఆగిపోయాయి. అక్కడొక అరుదైన దృశ్యం.

ఇద్దరు భార్యాభర్తలు.. చూస్తుంటే ఆమె అనారోగ్యంతో వున్నట్టుగా వుంది. ఆమె ముఖం చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది.మామూలుగా అయితే ఆ సింగిల్ సీట్ లో  తెలియని వారు సైతం  ఇద్దరు సర్దుకుని కూర్చుంటారు .కానీ ఆ సీట్ లో ఆమె ఒక్కదాన్నే కూర్చోబెట్టి, రెండు సీట్ లకు మధ్య లో వుండే ఖాళీ లో  కింద కూర్చున్నాడు ఆ భర్త. నిజానికి ఆ ఖాళీ జాగా కూడా చాలా డిమాండ్ అక్కడ. జనరల్ బోగీలో ప్రయానించే ఎవరికైనా ఈ విషయం అనుభవమే.ఆమె బాగా నీరసంగా కనిపిస్తుంది. అతని కళ్ళలో కూడా కొంచెం ఆందోళన  కనిపిస్తుంది. ఎప్పుడు ఏం అడుగుతుందో అన్నట్టుగా ఆమె కదిలిన ప్రతిసారి ఆ భర్త ఆమెను ఆరాతీస్తున్నాడు 'ఏం కావాలన్నట్టుగా' .

రైలు వేగం అందుకుంది. వేడి వేడి వాదనలు చల్లారిపోయాయి. చాలా మంది నిద్రలోకి జారుకున్నారు. 'నిద్ర సుఖమెరగదు' అన్న విషయం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఉన్నంతలో ఎవరికి వారు నిద్రాదేవత ఒడిలో సర్దుకుపోయారు. నాకు సీట్ దొరకలేదు. నేను కూడా కొంత జాగా దొరికితే కిందే చతికిలబడ్డాను. కొంతసేపటికి ఎవరో toilet  తలుపు వేసినట్టు లేదు. దుర్వాసన ఎక్కువగా వస్తుండటంతో లేచి వెళ్ళి తలుపు వేసి ఆ పక్కనే వున్న డోర్ నుండి బయట ప్రపంచాన్ని చూస్తుండిపోయాను.చీకట్లో అన్నీ అస్పష్టంగా కదులుతున్న ఛాయాచిత్రాలే.కొంతసేపటికి 'ఇక చాలు' అనిపించి మళ్ళీ నేను ఇందాక చతికిలబడ్డ చోటుకి వచ్చాను.

అప్రయత్నంగా ఇందాకటి దృశ్యం గుర్తుకొచ్చి ఆ భార్యాభర్తలు  కూర్చున్న వైపు చూసాను. ఈసారి ఇంకా మనోహరమైన దృశ్యం. ఆమె మగతగా నిద్రపోతుంది. కింద కూర్చున్న భర్త ఆమె పాదాలను తన ఒడిలో పెట్టుకుని వాటిని ఒత్తుతు ఆమెకు  సపర్యలు చేస్తున్నాడు నిద్రపోకుండా. భార్య మాట వింటేనే తన పురుషహంకారం ఎక్కడ తగలడిపోతుందో అనుకునే భర్తేశ్వరులు ఇంకా వున్న ఈ లోకంలో, ఆయన చుట్టూ ఎంత మంది వున్నాపట్టించుకోకుండా ఆమె పాదాలు పట్టుకుని సపర్యలు చేస్తున్నాడు.వెంటనే నాకు ఒకసారి ఆఫీస్ లో కొలీగ్స్ మధ్య  చర్చకు వచ్చిన ఒక విషయం గుర్తుకొచ్చింది..

ఇంతకుముందు టీవిలో ఒక యాడ్ వచ్చేది. కార్ చెడిపోవడంతో ఇంటికి నడిచి వచ్చిన తన భార్య పాదాలను ఒడిలో పెట్టుకుని ఆమె అలసట పోగొడుతూ తన ప్రేమను తెలియజేస్తాడు భర్త. కమర్షియల్ గా ఈ వ్యాపార ప్రకటన కంపెనీకి ఎంత లాభం చేకూర్చిందో తెలియదుకాని. నిజానికి ఇది చాలా  అందమైన ఆలోచన.ఈ యాడ్ వచ్చినప్పుడల్లా మా కొలీగ్ వాళ్ళ అత్తగారు 'మరీ చోద్యం కాకపోతే ఇవేం ముదనష్టపు ఆలోచనలే తల్లీ. ఆ మొగుడనేవాడు కాళ్ళు పట్టుకున్నాడే అనుకో ఆ మహాతల్లి రెండు కాళ్ళు ఇచ్చెయ్యడమే. ఒద్దండీ అని వెనక్కి తీస్కోవడం తెలీదు' అని నోరునొక్కుకునేదట. ఈ విషయం మా కొలీగ్ ఆ యాడ్ వచ్చినన్నాళ్ళు ఏదో ఒక సందర్భంలో చెప్తుండేది.
 
ఇప్పుడు రైలు లో అలాంటి భర్త ప్రత్యక్షంగా తారసపడటం నిజంగా ఒక మంచి అనుభవంగా అనిపించింది నాకు. ఇలా భార్యలకు సపర్యలు చేసే భర్తలు ఇంకెవరూ లేరా అంటే.. ఖచ్చితంగా వుండే వుంటారు.. కానీ వారికి గుర్తింపేది. "కార్యేషు దాసీ..కరణేషు మంత్రీ.." అని అన్నీ స్థానాలు ఆడవారికే ఇచ్చేసారు మన పెద్దలు. కాబట్టి ఇలాంటి వారికోసం ఒక చిన్న మార్పుతో.." కార్యేషు దాసుడు.." అని అనుకుందాము...స్త్రీమూర్తులకు అభ్యంతరం లేకపోతే!