Monday 28 November 2011

ఔరా అనిపించే విషయాలు-2

1. తలపై జుట్టు కాస్త పల్చగా ఉంటే అందులో వుండే వెంట్రుకల సంఖ్య 90 వేల లోపే వున్నట్టు.

2. బ్రెజిల్ లో తయారయ్యే ఒక రకం బీర్ పేరు 'బ్రహ్మ'.

3. మన ముక్కుని గట్టిగా పట్టుకుని కూనిరాగాలు తీయలేం.

4. తోకచుక్కలో తోకభాగం ఎప్పుడూ సూర్యుడు వున్న వైపే సూచిస్తుంది.

5. ఒక్క అమెరికాలోనే పెళ్ళి ఉంగరాల నిమిత్తం ఏడాదికి 17 టన్నులకు పైగా బంగారాన్ని వాడుతున్నారు.

6. సగటున రెండువందలకోట్ల మందిలో ఒకరు 116 ఏళ్ళకు మించి బతుకుతారు.సో..మీ చుట్టుపక్కల ఎవరైనా 116 సం. మించి బతికితే వారిని రెండువందలకోట్లమందిలో ఒక ప్రత్యేకవ్యక్తిగా అనుకోవాలి.

7. ఒక మొక్కజొన్న పొత్తులో సగటున 800 గింజలు ఉంటాయట.ఇది కొంచెం నాకు డౌట్ గానే వుంది. ఈసారి మొక్కజొన్న పొత్తు కొన్నపుడు ఒకసారి లెక్కపెట్టేస్తే సరి.

8. బొమ్మబొరుసు ఆడేటపుడు బొమ్మ పడే అవకాశాలే ఎక్కువ. బొమ్మవైపు నాణెం బరువు కొంచెం ఎక్కువగా వుండటమే అందుకు కారణం.

9. మనుషుల్లో వేలిముద్రల్లాగే సింహాల్లో ఏ రెండింటి మీసాల అమరిక ఒకేలా వుండదట.

10. ఒక మనిషి తన జీవితకాలంలో 18 కిలోలకు పైగా దుమ్మును పీల్చుకుంటాడు. కాలుష్య తీవ్రతను బట్టి మున్ముందు ఈ కిలోలు పెరగొచ్చు.

* ఇవన్నీ వివిధ పత్రికలలో చదవడం ద్వారా తెలుసుకున్నవే.

Saturday 26 November 2011

ఐశ్వర్య కూతురు పేరు-పార్ట్2

ఐశ్వర్యరాయ్ కూతురుకి పేరు పెట్టాలన్న అభిషేక్ బచ్చన్ ట్విట్  కి నా మెదడు స్పందించి చివరకు "ఎల్వ, ఎల్లెల్వ" అనే రెండు పేర్లు ఫైనల్ చేసాను. ఆ పేర్లకు తదుపరి   టపాలో వివరణ ఇస్తానని ప్రియమైన బ్లాగరులకు మాటిచ్చాను. కానీ పని ఒత్తిడి వలన ఆలస్యమైపోయింది.మన్నించండి. ఇన్ని రోజులు "ఎల్వ, ఎల్లెల్వ" పేర్లకు వివరణ ఇవ్వలేకపోతున్నానె అనేది ఒక టెన్షన్ అయితే, నేను పేర్లు ఫైనల్ చేసేలోపు 'బేటీ బచ్చన్' కి బచ్చన్ కుటుంబం ఎక్కడ పేరు పెట్టేస్తుందోనని మరో  టెన్షన్... ఏదైతేలెండి "ఎల్వ, ఎల్లెల్వ" పేర్లు అంకురించడం వెనక గల సంఘటనలను మీ ముందుకు తీసుకు వొస్తున్నాను.

"ఎ" అనే అక్షరంతో పాపాయి పేరు ప్రారంభమవ్వాలనేది అభిషేక్ ఇచ్చిన ఒకే ఒక్క కండిషన్. అందుకోసం ముందుగా "ఎ" అనే ఆరంభం కలిగిన పదాలను, పేర్లను గుర్తుకుతెచ్చుకున్నాను...కొంచెం 'క్లూ' గా ఉపయోగపడతాయని.

'అసలు "ఎ" అనే అక్షరాన్నే పేరుగా పెడితే ఎలా వుంటుంది' అని ఒక ఆలోచన వచ్చింది. 'ఛఛ..బాగోదు. ఎందుకంటే "ఎ" అని అనగానే మనవారికి  వెంటనే "అడల్ట్స్ ఓన్లీ" అని అర్ధం వచ్చే "ఎ"  సినిమా సర్టిఫికెట్ తప్ప వేరే యేదీ గుర్తుకురాదు.కాబట్టి "ఎ" అనే అక్షరానికి ఎంత మంచి అర్ధం వున్నప్పటికి ఇక్కడ పనికిరాదు.

'ఎంకమ్మ' అని పెడితే..? బాగానే వుంటుంది..కానీ అది మన రాష్ట్రంలో వుండే ఒక  గ్రామదేవత పేరు అని తెలియని బాలీవుడ్ సినీజనం "ఇది తెలుగు సినిమాలోని పాపులర్ కామెడీ తిట్టు" అని బచ్చన్ కుటుంబానికి ఉప్పందిస్తే? నేను వాళ్ళను మోసం చేసానని అనుకుంటారు. కాబట్టి ఇది కాన్సిల్.

"ఎంకి" అని పేరు పెడితే...ఆహా! సత్తు కారేజ్ లో చద్దన్నం లా చాలా బాగుంది. పైగా 'ఎంకి' పేరుతో మన నండూరివారి అద్భుత సృష్ఠి వుండనే వుంది. ఇంతకంటే మంచి పేరు ఎక్కడ దొరుకుతుంది. ఇదే ఫైనల్ అనుకున్న వెంటనే మళ్ళీ మనసులో మరో భయం..."పంటకాల్వలు, పిల్లగాలులు, వెండి మబ్బులు, పైరు పడుచులు తెలియని వారికి 'ఎంకి' అని పేరు పెట్టి అవమానిస్తావా నీ ఎంకమ్మ" అని నండూరివారికి కోపం వచ్చి నన్ను తిడితే..అమ్మో బాగుండదు..కాన్సిల్.

ఇలా అనుకున్న ప్రతిదానికి ఏదో ఒక సమస్య..
ఎవరెస్ట్ అని పెడితే...? -  "మరో ఐశ్వర్యరాయ్ కావల్సిన అమ్మాయికి పెట్టాల్సిన పేరు నాజూగ్గా వుండాలిగాని పర్వతాలు, గుట్టల పేర్లేమిటి" మనసు ఘోష!

ఎరుపు..ఎకరం..ఎటకారం..ఎవరు..ఎకాడ.. ఇలా ఎన్నో.. ఎన్నో ఆలోచనలు..కానీ ఫలితం శూన్యం. "ఎవరు, ఎకాడ.." కూడా పేర్లేనా అని అడగొద్దు. ఇప్పటి పేర్లకు చాలా మట్టుకు అర్ధం వుండట్లేదుకదా అనేదే నా ధైర్యం.

చివరకు నా ప్రయత్నాన్ని విరమించుకోవాలనే నిర్ణయానికి వచ్చి చివరి ప్రయత్నంగా 'నరసాపురం దగ్గర లచ్చేశ్వరంలో' వుంటున్న నా క్లాస్మేట్ వెంకీ కి ఫోన్ చేసి విషయం చెప్పి సలహా అడిగాను.

"ఏంట్రా! ఎకసెక్కాలా.. ఆ వార్త వచ్చినకాడ్నించి నేను అదే పనిలో వున్నాను. ఎండుచేపలు,ఎండుకొబ్బరికాయలు, ఎలితుమ్మచెట్లు, ఎలక్కాయలు తప్ప నాకు కొత్త పేర్లేమి బుర్రలోకి రావట్లేదు. బుల్లి ఐశ్వర్యకు పేరు పెట్టి క్రెడిట్ కొట్టేయాలని నాకు మాత్రం లేదేంటి.అలాంటి ఐడియా వత్తే ఆ పేరేదో నేనే పెట్టేత్తానుగాని నీకు చెప్తానేంటి..ఎల్లెల్వా" అని ఫోన్ పెట్టేసాడు.

వాడు కోప్పడితే కోప్పడ్డాడు గాని చివర్లో వాడన్న పదం పై నా దృష్టి పడింది. "ఎల్లెల్వా".. ఇది కూడా "ఎ" అనే అక్షరంతోనే ప్రారంభమయ్యింది. దీన్నే కొత్తగా చెబితే.. ఇందులో మొదటి, చివరి అక్షరాలను కలిపితే "ఎల్వ".. ఇంకొంచెం మార్పు చేస్తే.."ఎలెల్వా".హమ్మయ్యా నేను డిసైడ్ ఐపోయాను..ఈ రెండు సెమీఫైనల్..వీటిలో ఒకటి ఫైనల్. ఇక మిగిలింది..."ఎల్వ..ఎలెల్వ" లో ఫైనల్ విజేత ఎవరు? ఇప్పటి పేర్లు పెద్దగా వుంటే పిలిచేంత టైమ్, ఓపిక రెండు జనాలకి వుండట్లేదు కాబట్టి..ఆ రకంగా  నా ఓటు "ఎల్వ" కి వేసాను. అయినా కాని ఎక్కువ శాతం ఓట్లు ఏ పేరుకు పడితే అదే ఫైనల్ పేరు అవుతుంది.
ఈ టపా చదివినవారిలో బచ్చన్ కుటుంబ అభిమానులు, దగ్గరివారు ఎవరైనా వుంటే ఒక వినతి.. మీకు ఈ టపా నచ్చితే నాగురించి వారికి చెప్పండి. నచ్చకపోతే వారి దృష్ఠికి తీసుకెళ్ళకండి.
(సెలబ్రిటీస్ ఇంట్లో ఏంజరిగినా వార్తే అన్నదానికి ఇది సరదా ప్రయత్నం మాత్రమే.. సరదాగా తీస్కోండి)

Tuesday 22 November 2011

హలో..వినిపిస్తుందా!

మా సహొద్యోగి మెయిల్ చేసిన కామెడి స్టోరి బాగుందనిపించి బ్లాగుతున్నాను. ఇది ఇంతకుముందే కొందరికి తెలిసే వుంటుంది అనుకుంటాను..తెలియని వారు సరదాగా నవ్వుకోవచ్చు. 

A man feared his wife wasn't hearing as well as she used to and he thought she might need a hearing aid. Not quite sure how to approach her, he called the family Doctor to discuss the problem. The Doctor told him there is a simple informal test the husband could perform to give the Doctor a better idea about her hearing loss.

Here's what you do," said the Doctor, "stand about 40 feet away from her, and in a normal conversational speaking tone see if she hears you.
If not, go to 30 feet, then 20 feet, and so on until you get a response."

That evening, the wife is in the kitchen cooking dinner, and he was in the den. He says to himself, "I'm about 40 feet away, let's see what happens."
Then in a normal tone he asks, 'Honey, what's for dinner?"
No response. So the husband moves to closer to the kitchen, about 30 feet from his wife and repeats, "Honey, what's for dinner?"
Still no response.
Next he moves into the dining room where he is about 20 feet from his
wife and asks, Honey, what's for dinner?"
Again he gets no response so,
He walks up to the kitchen door, about 10 feet away. "Honey, what's  for dinner?"
Again there is no response.
So he walks right up behind her. "Honey, what's for dinner?" ;
;
;
;
;
;
;
;
;
" Raj, for the FIFTH time I've shouted., CHICKEN!"

Moral of the story:
The problem may not be with the other one as we always think,could be very much within us..! So before pointing mistake on other let's check ourselves at first.
 
చివర్లో భార్య డైలాగ్ చదివాక బాపుగారి కార్టూన్ వుండుంటే ఈ కథకు నూటికి నూరు మార్కులు పడేవని అనిపించింది.

Monday 21 November 2011

ఐశ్వర్య కూతురు పేరు-పార్ట్1

'మా ముద్దుల పాపాయికి మంచి పేరు సూచించండి' అంటూ అభిషేక్ బచ్చన్ కోరారు. 'ఎ' అనే అక్షరంతో మొదలయ్యే పేరు కావాలట.అందుకోసం ఒలింపిక్స్ రేంజ్ లో కసరత్తు చేస్తే చివరకు రెండు పేర్లు 'ఐశ్వర్య కూతురుకి సరిపోతానంటే  నేనని'  పోటీపడుతున్నాయి. 

"ఎల్వ, ఎల్లెల్వ"... ఎలా వున్నాయండి పేర్లు. వెరైటీగా ఫీలయ్యారా?
మీరు సింపుల్ గా 'బాగుంది...బాగోలేదు' అనేస్తే నేను వాటికోసం పడ్డ కష్టానికి గుర్తింపేముంటుంది. అందుకే ఈ 'ఎల్వ, ఎల్లెల్వ' అనే పేర్లు ఎలా పుట్టాయో వివరిస్తాను.

మునుపటి రోజుల్లో పిల్లలకు పెట్టె పేర్లకు ఒక అర్ధమంటూ తప్పనిసరిగా వుండేది. 'పెంటయ్య' అనే పేరు పలకటానికి మనకే ఇబ్బందిగా వున్నా దాని వెనకాల కూడా ఒక పరమార్దం వుండేదట. క్లుప్తంగా వివరిస్తాను.

ఒక తల్లి పుట్టబోయె బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటే పుట్టిన బిడ్డలు పుట్టినట్టు పురిట్లోనే చనిపోతున్నారట. ఆఖరికి మళ్ళీ బిడ్డ పుట్టబోయే సమయం ఆసన్నమైనప్పుడు ఆ బిడ్డ పై మునుపటిలా అతిగా ఆశలు పెట్టుకోకుండా 'ఈ బిడ్డ కూడా పుట్టలేదనుకుని పుట్టగానే తీస్కెళ్ళి పెంటమీద (చెత్తతో పేరుకుపోయిన గుట్ట)  పడెయ్యమన్నారట పెద్దలు'.అందరిలాగే వీడు బతకలేదనుకుందాం అని ఆ తల్లిదండ్రులు అలాగే చేసారట. విచిత్రంగా ఆ బిడ్డడు బతికాడు. అందరిలో ఒకటే ఆనందం.ఇన్ని దేవుళ్లకు మొక్కినా దక్కని బిడ్డ ఇప్పుడు దక్కడానికి ఆ పెంటే కారణం అనుకుని అతనికి 'పెంటయ్య' అని పేరు పెట్టారట.

ఇక ఇప్పటి పిల్లల పేర్లలో అర్దాలు వెతుక్కోవడం కంటే పెద్ద తప్పు మరోటి వుండదు. మొన్న తెలిసిన వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమానికి వెళ్ళాం. అక్కడకు ఒకామె ఐదు సంవత్సరాల తన కూతుర్ని తీసుకుని వచ్చింది. తల్లి వచ్చీరాని ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడే ప్రయత్నం చెయ్యడం లేదు. కాని ఆమె ఈ.గో జిల్లా (తూ.గో.జిల్లా) వాస్తవ్యురాలని ఇంగ్లీష్ లోంచి తొంగి చూస్తున్న స్లాంగ్ ఇట్టే చెప్పేస్తుంది.భోజనాల సమయంలో 'పిస్సీ' బట్టలమీద పడకుండా తిను అని బట్లర్ ఇంగ్లీష్ లో  అంది.

అది విన్న నేను ముద్ద మింగడం మానేసి మెడ పైకెత్తి చూసాను. 'పిస్సీనా'.. అప్రయత్నంగా బయటకు అనేసాను."అవునండి.. పాప పేరు పిస్సీ".. అంది. నాకు ఆ పదం వినగానే వేరే యేదో వాడుకలో వున్న అర్ధం స్పురించింది. అంతెందుకు 'అలా మొదలైంది' సినిమాలో టాయ్-లెట్ దగ్గర హీరో హీరోయిన్ తో చెప్పిన పదం ఏదో గుర్తొచ్చింది. నా ఆలోచనలకు ముగింపుగా "అమ్మా! సాంబారు చాలా బాగుంది.పిసుక్కుని తింటుంటే ఇంకా బాగుంది" - అని ఆ చిన్నారి ఎలాంటి అరమరికలు లేకుండా వాళ్ళమ్మకు అరుస్తూ చెబుతుంది."పిస్సీ" అంటే అర్ధం ఏమిటండీ అని అడుగుదామనుకునే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను.తీరా అడిగాక "మీరు అలా మొదలైంది సినిమా చూడలేదా?" అని ఆ బంగారు తల్లి అడిగితే.

ఇందేంటిది ఎక్కడో ములిగి ఎక్కడో తేలాను. అసలు ఐశ్వర్య కూతురికి 'ఎల్వ, ఎల్లెల్వ' అనే పేర్లు పెట్టడం వెనకున్న అర్ధం, అసలు ఆ పేర్లు ఎలా పుట్టాయనేది చెప్పడం మానేసి ఎటో వెళ్ళిపోయాను.
బ్లాగరులు క్షమించండి.ఐశ్వర్య కూతురు పేరు సినిమాలా చెప్పాలనుకుంటే సీరియల్ అయ్యింది. సమయాభావం వలన 'ఎల్వ, ఎల్లెల్వ' పేరుకు వివరణ ఈ టపా లో ఇవ్వలేకపోతున్నాను. తదుపరి టపాలో సూటిగా విషయానికి వచ్చేస్తాను. ఈలోపు ఈ రెండింటిలో ఏ పేరు ఫైనల్ గా పెడితే బాగుంటుందో మీరు కూడా ఆలోచించండి.

Sunday 20 November 2011

చింతావారి కాఫీహొటల్ - సేనాపతుల కాఫొటల్

వంశీగారి కథలలోని పాత్రలన్నీ మన చుట్టూ వుండేవే కనిపిస్తాయి. గోదావరి జిల్లాలవారికైతే మరీను..ఆ కథలు చదువుతుంటే చిన్నప్పుడు నాకు తెలిసిన ఎన్నో పాత్రలు అమాంతంగా ప్రత్యక్షమై నన్ను గతంలోకి లాక్కెళ్ళిపోయి జ్ఞాపకాల ఆతిధ్యంతో మనసును మైమరపింపజేస్తాయి.పూతరేకులు తిన్నంత మాధుర్యం ఆ సమయంలో. అందుకే వంశీగారి పాత్రలు, వాటికి కొంచెం దగ్గర పోలికలు వుండి నాకు ఎదురుపడిన వ్యక్తులను గుర్తుచేసుకోవడంకోసం బ్లాగు రూపంలో ఈ చిరుప్రయత్నం.
ముందుగా 'మా పసలపూడి కథలు'లో "శ్రీశ్రీశ్రీ పూసపాటి రాజావారు" కథ నుండి నాకు తెలిసిన పాత్రలను, ప్రదేశాలను గుర్తుచేసుకుంటున్నాను.
చింతావారి కాఫీహొటల్ - సేనాపతుల కాఫొటల్ :  ఇది మా పెనాదం (పెనుమదం) సెంటర్లో చాలా ఫేమస్.తాటాకుతో కుట్టిన  పెద్ద సైజు పూరిగుడిసెలా వుండేది ఈ కాఫటల్ (కాఫీహొటల్).మేము బైటకెల్లి టిఫిన్ తినడమే చాలా తక్కువ కాని ఎప్పుడెల్లినా ఇది బిజీగానే వుండేది. చిన్న చిన్న బల్లలు, సత్తుగ్లాసులు, చిన్న అరిటాకులతో టిఫిన్ వడ్డించే స్టీలు ప్లేట్లు. అప్పట్లో అన్ని హొటల్లో ఊకపొయ్యలు వుండేవి. లోపలికెళ్తే వెచ్చగా వుండేది. చింతామణి చట్నీ, బొంబాయి చట్నీ తో దిబ్బరొట్టు తింటే వుంటాది నాసామిరంగా.. అది చెప్తే కుదరదు తినాల్సిందే. ప్రస్తుతం ఈ హొటల్ పోయి చిన్న సైజు షాపింగ్ కాంప్లెక్స్ వచ్చింది.అందులో ఒక పోర్షన్ లో బజ్జీపప్పు అమ్ముతున్నారు.

పదం సువార్త - పల్లమ్మగారి సువార్త : అసలు 'సువార్త' అనే పదానికి అర్ధం ఏమిటో నాకు ఇప్పటికీ కరెక్ట్ గా తెలీదు. బహుశ 'శుభవార్త' అనే పదానికి వాడుక రూపమే 'సువార్త' అయ్యుంటుందేమోనని నాకు అప్పట్నించి ఇప్పటివరకు వున్న ఒక అభిప్రాయం.  ఇలాంటి సువార్త అనే పేరున్న వాళ్ళు చాలామందే వున్నారు. 'పిల్లేయ్..సువార్త! నీళ్ళు తోడేటప్పుడు  అంత ధబేల్న పడేత్తే చేద తెగిపోయి నూతిలో పడిపోద్ది' అని మా అమ్మమ్మ ఈ పల్లమ్మగారి సువార్తను అంటుంటేది.
బొడ్డు సూరయ్య - బొడ్డు సూర్నారాయ్న : మేము హైస్కూల్ చదివేరోజుల్లో సూర్నారాయ్న గారి కొట్టంటే బాగా ఫేమస్. ఇక్కడ గుండుసూది కాడ్నించి అట్లాస్ వరకు ఏదైనా దొరుకుతుంది. పావలాకు పెట్టే దోసెడు బఠానీలు, దోసెడు బొంబాయ్ సెనగలకు సూర్నారాయన కొట్టంటే కుర్రగాలానికందరికీ నోటెడ్. దీపావళి వస్తుందంటే చాలు సిసింద్రీ గుల్లలు, సూరేకాంతం, మతాబు గుల్లలు తెగ కొనేత్తారు. ఉలవలు కట్టడానికి వుపయోగించే పేపర్లను కూడా పుస్తకాల అట్టల్లాగ అమ్మేసేవాడు ఈ బొడ్డు సూర్నారాయ్నగారు. 
ఉల్లిపాయల గంగిరెడ్డి - ఉల్లిపాయల నారాయణ : వారానికి ఒక్కరోజు  లచ్చివారం (లక్ష్మివారం, గురువారం)మా ఊరిసంత. ఉల్లిపాయల నారాయనమూర్తి కొట్టంటే పెనాదం మొత్తానికి తెలిసిన పేరు. ఎవరైనా కాయగూరలు కొనాలని వెళ్ళి 'కేజీ ఎలాగండి నారాయన మూర్తిగారు?' అని దేన్నైనా అడిగితే చాలు. 'సవకే అబ్బాయ ఏస్కో' అని తక్కెడను అందులోకి పోనిచ్చి కేజీ నికరంగా తూసి సంచులో వేసేసేవాడు.ఈయన యాపారం చేత్తుండగానే పెద్దకొడుకులిద్దరూ కూడా ఇదే యాపారం పెట్టి ఆయనే కాంపిటేసన్ ఐపోయారు.
... అర్టిపళ్ళు,కలర్ సోడా అమ్మే మేడపాడు రాజుగారు.. వెండి మొలతాడు గొల్లకిట్టయ్య, గంటాగలాసు.. ఇలా మరికొంతమంది గురించి వేరే టపాలో చెప్తాను...!

Saturday 19 November 2011

మొబైల్ గుసగుసలు

* ఈ పోస్ట్ ఉద్దేశ్యం SMS ల ద్వారా వచ్చిన సరదా విషయాలను పొందుపరచడమే తప్ప ఎవరిని బాధపెట్టాలని కాదు. .. !

'శ్రీరామరాజ్యం' సినిమాలోని డైలాగ్ ని బాలకృష్ణ  'సింహా' సినిమా టైప్ లో చెబితే ఎలావుంటుంది.
...రావణాసురుడితో -
"చూడు..నావైపే చూడు..సీతవైపు చూడకు..మసైపోతావ్"
---
"పోలీస్.. మారీచుడు మాయ లేడి రూపంలో మోసం చేసినప్పుడు నో పోలీస్,
రావణాసురుడు కపట సన్యాసి వేషంలో వచ్చినప్పుడు నో పోలీస్,
సీతాపహరణాన్ని అడ్డుకున్న జటాయువు రెక్కలు తెగ్గొట్టినప్పుడు నో పోలీస్,
అశోకవనంలో సీతాదేవిని రావణుడు బందించినప్పుడు నో పోలీస్,
హనుమంతుని తోకకు నిప్పెట్టినప్పుడు నో పోలీస్..వద్దు.. inspector నా దారికి అడ్డురావద్దు"
----
వెంగళప్ప : 'జంతికలమ్మా..జంతికలోయ్..'
వెర్రివెంగళ్ : అదేంటి నాన్నా జిలేబీలమ్ముతు జంతికలంటున్నావ్?
వెంగళప్ప : గట్టిగా అనకురా ఈగలు వింటే వచ్చేస్తాయి.

----
 భర్త : డియర్ ప్రియ! కొన్ని కారణాల వల్ల ఈ నెల సేలరీ పంపలేకపోతున్నాను. అందుకు బదులుగా 100 ముద్దులు పంపుతున్నాను తీసుకో..
వారం రోజుల తర్వాత..
భార్య: మీరు పంపిన ముద్దులలో 5 పాలవాడికి, 25 హౌస్ ఓనర్ కి, 5 పేపర్ బాయ్ కి, 5 టెలెఫోన్ వాడికి, 10 కిరాణావాడికి ఇచ్చాను. ఇంక వచ్చేనెలకు 50 వున్నాయి.

 ------
#  నేను SMS పంపితే మీరు  కూడా  SMS పంపాలని రూల్ లేదు. ఒక హోండాసిటి కార్, వాషింగ్ మేషిన్, ఫ్రిజ్..ఇలా ఏదైనా పంపొచ్చు.

Thursday 17 November 2011

శోకాల సేద్యాలు

అన్నపూర్ణమ్మ ఒడిలో అన్నదాతను నేను
ఆత్మహత్యల ఖాతాలో అంకెల జాతరనైనాను!


అభివృద్ది మంత్రాలు ప్రకృతిని చెరబడుతుంటే
వరుణుడు ముఖం చాటేస్తున్నాడు..
సూర్యుడు ఎండల పండగ చేసుకుంటున్నాడు
నెర్రలు తీసిన నేలను నైవేద్యంగా తింటూ..


సేద్యానికి పట్టిన చెదపురుగులు
చెమటలు చిందే రెక్కల కష్టాల్ని కొరుక్కుతినేస్తుంటే..
ఆశలు పండవు...అప్పులు తీరవు
ఎండిన చేల ఎక్కిరింపుల మధ్య..
బక్కిచిక్కిపోతున్నాను...బతుకునీడ్చలేకున్నాను


ఆకలి తీర్చే రైతన్నను హారతికర్పూరమైపోతుంటే
దిక్కుతోచక మృత్యువుకు ఆహారమైపోతుంటే
కర్షక  లోగిళ్ళలో శోకాల సేద్యాలే మేటలు వేస్తున్నాయి.


అన్నపూర్ణమ్మ ఒడిలో అన్నదాతను నేను
ఆత్మహత్యల ఖాతాలో అంకెల జాతరనైనాను!

Tuesday 15 November 2011

ఔరా అనిపించే విషయాలు

1. మన శరీరంలో చర్మం అత్యంత పల్చగా వుండే ప్రదేశం కనురెప్పలు.
2. మనిషి లిపికంటే ముందు మ్యాపులు తయారుచేయడం నేర్చుకున్నాడట.
3. ఒక కిలో తేనెను  సేకరించడానికి పట్టులోని తేనెటీగలన్నీ కనీసం 40 లక్షల పూలమీద వాలతాయి.
4. జపాన్ బుల్లెట్ ట్రైన్ గరిష్ట వేగం గంటకు 285 కి.మి. అయితే దీనికి పోటీగా చైనా రూపొందించిన 'హార్మోని' ట్రైన్ వేగం గంటకు 394 కి.మి.
5. ముద్దుపెట్టుకునేటప్పుడు ఎక్కువ మంది తమ తలను కుడివైపునకు వంచుతారట.
6.మనం మనస్పూర్తిగా నవ్వే 15 నిమిషాల నవ్వు 2 గంటల నిద్రతో సమానమట.
7. బంగ్లాదేశ్ జాతీయగీతాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్.
8. ఎంత ప్రయత్నించినా మన మోచేతిని మనం ముద్దాడలేము.
9. అతి తక్కువ జనాభా కలిగిన దేశం 'వాటికన్ సిటి' జనాభా 800 మంది.
10. మిగిలిన దేశాలతో పోలిస్తే మనదేశంలో 'ఆల్జీమర్' వ్యాదిగ్రస్తుల శాతం తక్కువగ వుండటానికి మనం వంటలలో వాడే 'కరివేపాకు' కూడా ఒక కారణమట.

* ఇవన్నీ వివిధ పత్రికలలో చదవడం ద్వారా తెలుసుకున్నవే.

Sunday 13 November 2011

వెర్రివెంగళ్ పాటగోల

వెంగళ్ళప్ప గారాల కొడుకు 'వెర్రి వెంగళ్'. వాడు నిద్రపోవాలంటే ఖచ్చితంగా పాటపాడాల్సిందే. కొద్దిరోజులు వచ్చిరాని పాటలు పాడి వెర్రివెంగళ్ ని నిద్రపుచ్చిన వెంగళ్ళప్ప దీనికి ప్రత్యామ్నాయంగా FM ని నమ్ముకున్నాడు. ఒక్కసారి దానిని ఆన్ చేసి వదిలేస్తె అందులో వచ్చే పాటను వింటూ నిద్రలోకి జారిపోతాడు వెర్రివెంగళ్. రాత్రి ఏం జరిగిందంటే వస్తూవస్తూ షడన్ గా పాట ఆగిపోయింది. వెర్రివెంగళ్ కి మెలుకువ వచ్చేసింది. వాడు 'పాటకావాలి' అని ఒకటే ఏడుపు.
ఇంతవరకు అలాంటి పరిస్తితిని ఎదుర్కోని వెర్రివెంగళప్ప 'ఒక్క నిమిషం వెంగళ్' అని వాడిని ఒళ్ళోపెట్టుకుని లాలిస్తు రేడియో విప్పి చూసాడు.అందులో ఒక బొద్దింక చచ్చిపోయి వుంది. దానిని బయటకు తీసి 'అయ్యో...ఇదా సంగతీ' అన్నాడు.
'ఏమయ్యింది డాడి' అని అడిగాడు వెర్రివెంగళ్
'సింగర్ చచ్చిపోయింది వెంగళ్' అని విచారంగా అన్నాడు.
'లోపలొక ఆంబులెన్స్ పెట్టుంటే అది బతికేదేమో. ఆ.. నువెప్పుడు ఇంతే..అన్నీ నేనే చెప్పాలి' అంటూ ఏడుపు అందుకున్నాడు వెర్రివెంగళ్.

* ఆధారం : రాత్రి నా చరవాణికి ఒక స్నేహితుడు పంపించిన సంక్షిప్తసందేశం.

"దూకుడు" రికార్డ్స్ ని మించిన రికార్డ్

బ్లాగు చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్. నాకు తెలిసి ఇప్పటి వరకు జరగనిది.. ఇక ముందు కూడా జరగని సెన్సేషనల్ రికార్డ్ ఇదే..ఇదే..ఇదే.. ఈ నా బ్లాగ్ రికార్డ్ ముందు మహేశ్ 'దూకుడు' రికార్డ్స్ ఏరకంగా చూసినా సరిపోవు. బ్లాగరుల్లో ఎవరికైనా 'గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్' వారితో పరిచయం వుంటే వెంటనే ఈ విషయం వారి చెవిలో వేసి నా బ్లాగ్ చరిత్రపుటల్లో వుండేలా మీ వంతు సాయం చేయండి.
అంతర్జాల వీక్షకులలో ఎవరికైనా మీడియా వారితో పరిచయం వుంటే వెంటనే 'పగిలిపోతున్న వార్త' రూపంలో టీవీ లలో వచ్చి ప్రపంచమంతా 'న్యూసై' కూసేలా చేయండి. ఇంకా ఇలా ఏఏ రూపాలలో ఈ సంచలన రికార్డ్ ని జనం ముందు వుంచాలో అన్ని రూపాలలో వుంచడానికి నా శ్రేయోభిలాషులందరు  తలో దిక్కుకు పరుగులు తీయండి.
'ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటారా..? అయ్యో ఇంతకీ నేను విషయం చెప్పకుండానే ఈ హడావిడి చేస్తున్నాన. క్షమించండి.. ఇంతకీ ఆ వార్త ఏంటంటే..'నిన్ననే ప్రారంభించిన నా బ్లాగు... పట్టుమని పది టపాలు కూడా లేని నాబ్లాగు...ఉదయానికి కేవలం 23 హిట్స్ తో వున్న నా బ్లాగు.. ఇప్పుడు చూసేటప్పటికి నాలుగు లక్షల హిట్స్ దాటి ఐదు లక్షల వైపు పరుగులు పెడుతుంది. ఇంతకంటే గొప్ప రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, బ్లాగ్ ఆఫీస్ రికార్డ్ ఇంకేముంటుంది.ఋజువు కావాలంటే నాబ్లాగుకు ఎడమవైపున, పైభాగంలో వున్న హిట్ కౌంటర్ చూడండి.
"..ఈ దూకుడు..." అదిగో ఎవరో సందర్భానికి తగ్గ పాట ప్లే చేస్తున్నారు. "సాటెవ్వరు"...


గమనిక : ఇలాంటి వింత జరగడానికి కారణం ఏమయ్యుంటుందో తెలిస్తే చెప్పగలరు. కలికాలం అని మాత్రం తప్పించుకోకండి.

Saturday 12 November 2011

నా పేరేంటో

అనగనగా ఒక ఈగ. ఆ ఈగ మందుకొడుతూ తన పేరు మర్చిపోయింది.తన పేరు ఏమయ్యుంటుందా అని ఎంత ప్రయత్నించినా ఫుల్ బాటిల్ అయిపోయింది గాని పేరుమాత్రం గుర్తురాలేదు.మత్తు తలకెక్కి కంట్రోల్ తప్పుతున్నా 'స్టడీ..స్టడీ' అనుకుంటూ తన పేరు తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈగ. ముందుగా అక్కడ వైన్ షాప్ పక్కనున్న బజ్జీ బండివాడ్ని 'అబ్బాయ్ అబ్బాయ్ పేరేంటో చెప్పవా?' అని అడిగింది.
'బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్' అన్నాడు.
'బ్రేకింగ్ న్యూస్ బాబూరావా?' ఎవరి పేరది? 
'నాపేరు'
'నీపేరు నాకెందుకు నాపేరు కావాలి..సరేగాని నీ పేరు 'బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్' అన్నావుకదా..ఏదీ ఓక బ్రేకింగ్ న్యూస్ చెప్పు?'
'మందుకొట్టి పేరు మర్చిపోయిన  ఈగ'
'ఆ..మందుకొట్టి పేరు మర్చిపోయిన  ఈగ'. మందుకొట్టింది నేనే.. పేరు మర్చిపోయింది నేనే.. అంటే నాపేరు ఈగన్నమాట...స్టడీ స్టడీ నాపేరు ఈగ'  అంటూ మళ్ళీ మందుకొట్టడానికి వెళ్ళిపోయింది ఈగ.